Sri Bhadrakali Devastanam

శ్రీ భద్రకాళి దేవస్థానం

భద్రమ్మ గుట్ట, వరంగల్ జిల్లా

History & Significance


శ్రీ భద్రకాళీదేవీ దేవస్థానం

శ్రీరస్తు

శుభమస్తు

అవిఘ్నమస్తు

ఆలయ చరిత్ర

శ్రీ భద్రకాళీ అమ్మవారు అనాధి సిద్ధము స్వయం వ్యక్తం జగన్మాత దుర్గ సుహాష్టమి (దుర్గాష్టమి) రోజున భూమండలం మీద భద్రకాళిగా అవతరించిన ప్రదేశం ఈ ఓరుగల్లు మహానగరమని ప్రతీతి.

మహాసమ్యాం భద్రకాళీ దక్షయజ్ఞవినాశినీ | ప్రాదుర్భూతా మహాఘోరా యోగినీ కోటిభిస్సహ ||

అశోర్ధం పూజయేన్నిత్యం తస్మిన్నహని మానవై | త్రిసంధ్యం పూజయేద్దేవీం జవస్తోత్ర పరాయణ ||

మహాష్టమ్యాం భగవతీ భద్రాయామపి పూజితా: దదాతిచాయురారోగ్యం యతో భద్రాస్వరూపిణీ ||

ఆశ్వినస్యసితేపక్షే యాతు స్వాత్ తిథిరష్టమీ, తస్యాం రాత్రాపూజనీయా మహావిభవిస్తరైః ||

అహం భద్రాచ భద్రాహం నావయోరన్తరం క్వచిత్ | సర్వసిద్ధిం ప్రదాస్యామి భద్రాయామర్చితాప్యహం


మహాష్టమి అని పిలువబడుచున్న దుర్గాష్టమి రోజున జగన్మాత కోటి యోగినీ గణములతో భద్రకాళీ రూపముతో ఆవిర్భవించినదని పై దేవీభాగవత వచనములు తెలుపుచున్నవి. అట్టి అమ్మవారు ఈ భూమండలం నందు అవతరించిన స్థానం వరంగల్ మహానగరం అయి వుండుట నగరము యొక్క గొప్ప తనమును చెప్పకనే చెబుతున్నది. కావున నే దుర్గాష్టమి నాడు దేశ దేశాలనుండి ప్రజలు అమ్మవారిని దర్శించుటకు వరంగల్ నగరానికి విచ్చేస్తారు. వరంగల్ నగరము నందలి మడికొండ లోని మెట్టుగుట్ట హిడింబాశ్రమముగ అభివర్ణింపబడినది. పాండవులు అరణ్యవాసం లో హిడింబాశ్రమం లో కొంత కాలం ఉన్నట్లు మహాభారత ఇతిహాసం ద్వారా తెలుస్తున్నది. ఇక్కడికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలో గణపురం (ఘనపురం) వద్ద పాండవుల గుట్టల పేరుతో ఉన్న ప్రాంతం మరియు తదితర ఆధారాలు పాండవులు అరణ్యవాసం సందర్భంలో తెలంగాణా ప్రాంతంలో చాలా రోజులు సంచరించినట్లు తెలియుచున్నది. పాండవులు తమ అజ్ఞాతవాసం విరాట రాజు కొలువులో జపరడానికి నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళడానికి ముందు భద్రకాళిని పరి పరి విధాల స్తుతించి తమ ఆయుధములను శమీ వృక్షమునందు భద్రపరచి భద్రకాళీ అమ్మవారి అనుగ్రహంతో విరాటరాజు కొలువులో తమ అజ్ఞాత వాసాన్ని విజయవంతంగా పూర్తిచేసినట్లు మహాభారతం చెబుతున్నది. యుద్ధం ప్రారంభానికి ముందు కూడా శ్రీకృష్ణుని సూచనమేరకు పాండవులు భద్రకాళిని స్తుతించినట్లు కూడా ఇతిహాసం చెబుతున్నది. ఇట్లాంటి ఎన్నో పురాణ గాథలు, ఇతిహాసాలు వరంగల్ నగరంలో అవతరించిన శ్రీ భద్రకాళి అమ్మవారి యొక్క మహిమలను పలు పలు విధాలుగా తెలుపుతూ భద్రకాళీ అమ్మవారి మహత్వాన్ని వరంగల్ నగరం యొక్క ప్రాచీనత్వాన్ని చాటుతున్నాయి.


వేంగి రాజ్యమును జయింపనరుగు చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి భద్రకాళి అమ్మవారిని సేవించి అమ్మవారి అనుగ్రహమున అర్థసిద్ధి బడసి క్రీ.శ. 625 ప్రాంతమున అమ్మవారికి ఇట్టి ఆలయమును నిర్మించినట్లు శాసనము వలన తెలుస్త్నుది. అందుకు ఆధారం - అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండశిల మీద ఉండటమే. రెండవది- ఈ ఆలయ నిర్మాణానికి నిలిపిన మూలస్తంభాలు చతురస్త్రాకారంలో ఉన్నాయి. కాకతీయుల స్తంభ విన్యాసం వర్తులాకారంలో కన్పిస్తుంది. ఈ కారణాల వల్ల కూడా దేవాలయం చాళుక్యుల కాలంలో నిర్మింపబడిందని చెబుతారు.


అయితే ఆలయ స్తంభాలు చెక్కిన విధానము, ఆ స్తంభాలను నిలబెట్టిన విధానము, విశాలమైన ముఖద్వారము అన్నీ కాకతీయుల శైలిలోనే కన్పిస్తాయి. కనుక కాకతీయుల కాలంలో నిర్మింపబడిందేనని కూడా అనిసిస్తుంది. అంతేకాక భద్రకాళి గుడిలోని అంతరాళ స్తంభాలలో ఒక దాని మీద " మహేశశ్చారు సంధత్తే మార్గణం కనకాచలే - మంత్రి విర్ధన ఎఱ్ఱుస్తు మార్గణే కనకాచలమ్ ।। అనే శ్లోకం కన్పిస్తుంది. ఈ శాసన పాఠం పురాతత్త్వ శాఖ వారు ప్రచురించిన వరంగల్ జిల్లా శాసనాలలో (పు. 307) ఉన్నది. ఈ శ్లోకంలో ఎఱ్ఱన క్రీ.శ. 10వ శతాబ్దిలో కాకతిపురమును పాలించినట్లు గూడూరు శాసనమును బట్టి తెలుస్తున్నది. ఈయన తండ్రి విరనామాత్యుడని, ఆయనకు మీసరగండడనే బిరుదు ఉండేదని ఈ శాసనాన్నిబట్టి తెలుస్తున్నది. ఇదే విషయము భద్రకాళి దేవాలయములోని' మరొక స్తంభం మీద కూడా కొంచెం భేదంతో ఉన్నది. అది "మంత్రి మీసరగండేన, విరనామాత్య సూనునా! ఎరయాఖ్యేన సమోదాతా, నభూతో న భవిష్యతి!! అనే శ్లోకం ఈ రెండు స్తంభ శాసనాలను బట్టి ఈ దేవాలయం క్రీ.శ 10వ శతాబ్దంలో నిర్మింపబడి ఉంటుందని ఊహించవచ్చును. లేదా కాకతి ప్రతాపరుద్రుని సర్వ సైన్యాధిపతియైన ఆడిదం మల్లుకు కూడా మీసరగండడనే బిరుదు కన్పిస్తుంది. కనుక ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించబడిందో లేదో సరిగ్గా చెప్పలేము. గణపతిదేవ చక్రవర్తి కాలంలో విరనామాత్యుని కొడుకైన ఎరయాఖ్యుడు ఆలయ పార్శ్యంలో తటాకాన్ని త్రవ్వించి, ఆలయానికి కొంత భూదానం కూడా చేసినట్లు శాసనము ద్వారా తెలుస్తున్నది. కనుక ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించబడిందో లేదో సరిగ్గా చెప్పలేము. ఏది ఏమైనప్పటికీ కనీసం వెయ్యి సంవత్సరాలకు పై బడిన చరిత్ర గలది ఈ భద్రకాళి దేవాలయం. కాకతీయులు తమ రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చు సంద ర్భమున తమ రక్షణకై ఈ ఆలయమును అభివృద్ధి చేశారు. రుద్రమదేవి అమ్మవారిని దర్శింపక భుజించెడిదికాదు. ప్రతాపరుద్రుని కాలానికే ఆమె భక్తులకు కొంగు బంగారమై కోరిన కోర్కెలను తీరుస్తూ ఉండినట్లు ఆ రెండు గ్రంధాలలోనూ కన్పిస్తుంది.

ఒకనాడు సుదర్శనమిత్రుడనే పండితుడు నూరుగురు విద్వాంసులు కొలువగా ఏనుగు మీద ఎక్కి ఏకశిలానగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువు చూడడానికి వెళ్ళి అక్కడి విద్వాంసులతో వాదించడానికి వచ్చానని చెప్పాడట. అది విన్న విద్వాంసులు అతనిని అవమానపరచి పంపేశారు. దెబ్బతిన్న సుదర్శనమిత్రుడు, ఆ విద్వాంసులను కారుమాటలతోనైనా జయించాలనే ఉద్దేశ్యంతో “ఈ వేళ కృష్ణ చతుర్ధశి, రేపు అమావాస్య మీరు కాదంటారా?" అని ప్రశ్నించాడట. విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు. ఎందుకంటే ఔనంటే సుదర్శనమిత్రుని వాదం అంగీకరించినట్లవుతుంది, కాదంటే నే అతనిని ఓడించినట్టవుతుందని నిర్ణయించి "రేపు పౌర్ణమి" అని వాదించారట. విద్వాంసులు గెలువాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉండింది. ఈ సంకట స్థితి నుండి తమను రక్షించమని. శాకవెల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హనుమకొండకు వెళ్ళి భద్రకాళీ దేవిని పూజించి ఆ దేవిని 11 శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై " నీమాటలే నిలుపుతా"నని వరమిచ్చిందట. మరునాడు రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూసి సుదర్శనమిత్రుడు క్షమాపణ వేడుకొన్నాడట. ఇది కేవలం దైవీశక్తి కాని, మానుషశక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయాడట. ఆ విధంగా భద్రకాళిదేవి భక్తులను కటాక్షించటం ఆనాటి నుంచే కన్పిస్తుంది. ఈ వృత్తాంతంలో పేర్కొనబడిన శాఖవెల్లి మల్లిఖార్జున భట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోనివాడు. కనుక ప్రతాపరుద్రుని కాలం నాటికే భద్రకాళి గుడి ప్రసిద్ధమై ఉండినట్టు స్పష్టమవుతుంది.


క్రీ.శ. 1323 లో కాకతీయ సామ్రాజ్యం పై మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర వలన కాకతీయ సామ్రాజ్యం పతనమై ప్రతాపరుద్రుడు ఢిల్లీకి ఖైదీగా కొనిపోవబడ్డాడు. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఈ దేవాలయం ప్రాభవం కోల్పోయినట్టు తెలుస్తున్నది. శేషించిన కొంచెమును 1523 లో తల్లికోట యుద్ధముతో ఉత్పన్నమై పోయింది. సుమారు 1000 సంవత్సరములకు పైగా ఎంతో వైభవము ననుభవించిన ఈ దేవాలయము నామమాత్రావశిష్టమైయున్ననూ అమ్మవారి మహిమ మాత్రము నివురు గప్పిన నిప్పువోలె నుండి దర్శింప వచ్చిన భక్తులను రక్షించుచునే ఉన్నది. అదీ కాక హైదరాబాదు సంస్థానంలో సాగిన గోల్కొండ నవాబుల పాలన, రజాకార్ల దుశ్చర్యల ఫలితంగా దాదాపు క్రీ.శ. 1948 వరకూ ఈ దేవాలయం పునరుద్ధరణకు నోచుకోలేదు.


కాకతీయ సామ్రాజ్య పననానంతరం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకూ కూడా ఈ తెలంగాణ ప్రాంతం మతాంతరుల పాలనలోనే నున్నది. ఆలయము ఉపేక్షింపబడినది. ఆస్తులు అణ్యక్రాంతమైనవి భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన పిమ్మట తెలంగాణ ప్రాంతం భారతదేశం లో విలీనమైన తదుపరి వితరణశీలురైన పురజనులు సహకారముతో ఈ ఆలయము తన పుర వైభవమును సంతరించుకొనుచున్నది.

TOP